High court on hyderabad ward committe : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయకుండా.. అధికారులతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగానికి, జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధమంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డు కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదో తెలపాలని ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది.
వార్డు స్థాయి పాలనతో ప్రజలను భాగస్వామ్యం చేసేలా ప్రతీ వార్డులో స్థానికులతో కమిటీ ఉండాలని రాజ్యాంగం, జీహెచ్‌ఎంసీ చట్టం నిర్దేశిస్తోందని పిటిషనర్ వాదించారు. వార్డు కమిటీలు ఏర్పాటు చేయకుండా.. అధికారులతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం తగదన్నారు. వాదనలు విన్న హైకోర్టు వార్డు కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదో వివరాలు సమర్పించాలని సీఎస్‌కు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణ ఆగస్టు 21కి వాయిదా వేసింది.
High court on state consumer commission : రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు ప్రెసిడెంట్, సభ్యులను ఎప్పట్లోగా నియమిస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌కు ప్రెసిడెంట్, సభ్యులను నియమించడం లేదంటూ న్యాయవాది ఆకాశ్ వేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వినియోగదారుల వివాదాల పరిష్కారంలో కమిషన్ పాత్ర కీలకమని హైకోర్టు పేర్కొంది.
సేవా లోపాలపై హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వివాదాల పరిష్కారానికి కమిషన్ ఎంతో తోడ్పడుతోందని న్యాయస్థానం తెలిపింది. కమిషన్ ప్రెసిడెంట్, సభ్యుల పోస్టులు గతేడాది ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్నాయని.. నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ భర్తీ చేయలేదని పిటిషనర్ వాదించారు. వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను జులై 25కి వాయిదా వేసింది.
కాచిగూడలో ప్రారంభం.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కాచిగూడలో మొదటి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీల నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, వార్డు శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, వార్డు లైన్‌మెన్, ఓ కంప్యూటర్ ఆపరేటర్ తదితరులు అందుబాటులో ఉంటారు.
ఇవీ చదవండి: