ప్రస్తుత సచివాలయం భవనం బాగా దెబ్బతిందని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే నిర్వహణకే ఏటా రూ.5 కోట్లు వెచ్చించాల్సి వస్తుందంటూ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు చేయడానికి వీల్లేదంది. ప్రస్తుతమున్న భవనాన్ని నవీకరించడానికి అవకాశం లేదని, నిపుణుల నివేదికల ఆధారంగా రాష్ట్ర స్థాయికి తగ్గట్లుగా సచివాలయం సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా లేని ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు న్యాయ సమీక్ష పేరుతో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపింది. సచివాలయం కూల్చివేతను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, ఎంపీ రేవంత్‌రెడ్డిలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ సాంకేతిక కమిటీ నివేదిక ఆధారంగా సరికొత్త సచివాలయం సముదాయం నిర్మాణానికి మంత్రి మండలి తీర్మానించిందన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ దీన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారని, ప్రస్తుతమున్న భవనాల్లో అగ్నిమాపక శాఖ యంత్రాలు కూడా తిరగడానికి అవకాశం లేదని వివరించారు. ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని, సబ్‌కమిటీ ఇంజినీర్లతో మరో కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు.
ఏ నుంచి కె వరకు ఉన్న బ్లాకు భవనాల్లో డి, హెచ్ బ్లాకులు తప్ప మిగిలినవన్నీ సక్రమంగా లేవన్నారు. 25 ఏళ్ల క్రితం చేసిన వైరింగ్ దెబ్బతిందని, ఒకేచోట పార్కింగ్ లేదని తెలిపారు. ప్రస్తుతం 33 జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు కలిసి 500 మంది ఉంటారని, సమావేశం నిర్వహించడానికి తగిన మందిరం లేదన్నారు. ఈ పిటిషన్‌లను రాజకీయ ప్రత్యర్థులు వేశారన్నారు.
వారైతే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయకూడదా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ వాళ్ల కింద పనిచేసే అధికారులతో అనుకూలంగా నివేదిక తెప్పించారన్నారు. కేంద్ర ఏజెన్సీ, హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో నివేదిక తెప్పించాలని కోరగా ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. మీవద్ద ఏం ఆధారాలున్నాయో చెప్పాలంటూ విచారణను ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'