వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలన్న వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇటుక బట్టీల్లో ఉన్న వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు.. కార్మికశాఖ ఉప కమిషనర్లను ఆదేశించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలను షెల్టర్ జోన్లకు తరలించాలని కార్మికశాఖ ముఖ్య కార్యదర్శికి సూచించింది.
రైళ్లు, బస్సులు ఎక్కేవరకు భోజన, వైద్య సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది.
ద.మ.రైల్వే సమన్వయంతో స్వస్థలాలకు పంపించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. శ్రామిక్ రైళ్లు పెంచాలి లేదా కూలీల కోసం ప్రత్యేక రైళ్లలో 4 బోగీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
రైళ్లు, ప్రత్యేక బోగీలు, ఆర్టీసీ బస్సుల్లో తరలించే కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. వలస కూలీలను స్వస్థలాలకు పంపేటప్పుడు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని చెప్పింది. కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 9లోగా తెలపాలని కోరింది.
ఇదీ చదవండి: ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు