High Court on MLAs Purchase Case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిర్దేశించిన గడువుతో కూడిన నోటీసులు మెయిల్ ఐడీ, వాట్సాప్ ద్వారా అందిచాలని ఆదేశించింది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ సిట్ ఎదుట హాజరు కాలేదని.. దీనివల్ల దర్యాప్తు ఆలస్యమవుతోందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
బీఎల్ సంతోష్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని ఏజీ అన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏజీ కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం మరోసారి నోటీసులివ్వాలని ఆదేశించింది. బీఎల్ సంతోష్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులివ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి.. బీఎల్ సంతోష్ సిట్ ఎదుట హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా అని హైకోర్టు పేర్కొంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని బీజేపీతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పైనా వాదనలు జరిగాయి. ఈ కేసును కేవలం రాజకీయ లబ్ధికోసమే నమోదు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదించారు. దీనికి సంబంధించి హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని మహేష్ జెఠ్మలానీ తన వాదనలో పేర్కొన్నారు. 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు.. 30వ తేదీన విచారిస్తామని వాయిదా వేసింది.
ఇవీ చదవండి: ఎమ్మెల్యే ఎర కేసు.. నిందితుల అరెస్టు దిశగా సిట్ అడుగులు..?
'అఫ్తాబ్ కొడుతున్నాడు.. చంపి ముక్కలు చేస్తానన్నాడు'.. రెండేళ్ల ముందే లేఖ రాసిన శ్రద్ధ