రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారంటూ ప్రశ్నించింది. విపత్తు వేళ అంబులెన్స్‌లు నిలిపివేయడం మానవత్వమేనా? అంటూ నిందించింది.
రాత్రి కర్ఫ్యూ అమలు సరిగా లేదని, మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదని మండిపడింది. రంజాన్ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. మతపరమైన ప్రదేశాల్లో జనసమీకరణ ఆమోదయోగ్యం కాదని, కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరమని చెప్పింది.
ప్రభుత్వం చెప్పేవాటికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని, నిబంధనల ఉల్లంఘనపై మీడియా కళ్లకు కట్టినట్టు చూపిస్తోందని స్పష్టం చేసింది. పరీక్షలు పెంచాలని ఆదేశిస్తే.. మరింత తగ్గిస్తారా? అంటూ మండిపడింది. అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏంటో చెప్పాలని ఆదేశించింది.
మధ్యాహ్నం కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. తమ ఆందోళనను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని ఏజీకి హైకోర్టు సూచించింది. కేబినెట్ భేటీ అయ్యేవరకు విచారణ వాయిదా వేయాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. ఏజీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. విచారణను మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!