బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ వధ జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒంటెలు, ఇతర జంతువులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఒంటెల అక్రమ రవాణా, అక్రమ వధ నిరోధించాలని కోరుతూ వైద్యురాలు శశికళ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అక్రమ జంతువధకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది.
జంతు వధ, మాంసం దుకాణాల్లో అనుమతి ఉన్నవి ఎన్ని.. లేనివి ఎన్ని ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. జంతు వధ శాలలు ప్రభుత్వమే నిర్వహిస్తోందని.. మాంసం దుకాణాలకు జీహెచ్ఎంసీ అనుమతినిస్తోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు. మాంసం విక్రయ దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేస్తున్నారా.. అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిబంధనల ప్రకారమే జంతు వధ జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేకలను కూడా పశు వైద్యుడు ధ్రువీకరించిన తర్వాతే మాంసం చేయాలని నిబంధనలు చెబుతున్నాయని హైకోర్టు పేర్కొంది. లేకుంటే మాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
చైనాలో గబ్బిలాలు తిన్నందుకే కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని ధర్మాసనం ప్రస్తావించింది. హైదరాబాద్‌లో మాంసం వినియోగం ఎక్కువ కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.