చరిత్రాత్మక హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. హిందూ ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో నిర్మితమైన హైకోర్టు భవనం వందో ఏట అడుగు పెట్టింది. గులాబీ రంగు గ్రానైట్, రాతితో నిర్మించిన ఈ కట్టడం... దేశంలోనే అద్భుత నిర్మాణాల్లో ఒకటి. మూసీ నది ఒడ్డున నిర్మితమైన ఈ భవనం... నిజాం కాలం నాటి కళా నైపుణ్యాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. వందేళ్లయినా ఏ మాత్రం చెక్కుచెదరని గంభీరమైన సౌందర్యం.. హైకోర్టు భవనం సొంతం.
హైకోర్టు భవన నిర్మాణ చరిత్ర:
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920లో ఏప్రిల్ 20న భవనాన్ని ప్రారంభించారు. నిర్మాణం 1915 ఏప్రిల్ 15న ప్రారంభించి, 1919 మార్చి 31తో పూర్తి చేసినప్పటికీ.. 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కళాఖండంగా తీర్చిదిద్దాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన సిబ్బందికి చెప్పారు. పలు నమూనాలు పరిశీలించాక... చివరకు జైపూర్‌కు చెందిన నిర్మాణ నిపుణుడు శంకర్‌లాల్ నమూనాను ఆమోదించారు.
సుమారు 18 లక్షల 22వేల 750 రూపాయల అంచనా వ్యయంతో నవరతన్ దాస్‌కు నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చారు. నిజాం నవాబు ఇచ్చిన 300కిలోల వెండితో హైకోర్టు భవనం నమూనాను రూపొందించారు. గులాబీ రంగు గ్రానైట్‌తో.. ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతితో అద్భుత కట్టడంగా తీర్చిదిద్దారు. భవనం పైభాగంలో రామ్ రహీమ్ అనే పదాలు కనిపించేలా డోమ్‌లు నిర్మించారు.
అనేక పేర్లతో కొనసాగిన న్యాయస్థానం
హైకోర్టు భవనంలో అనేక పేర్లతో న్యాయస్థానాలు కొనసాగాయి. నిజాం కాలంలో రాయల్ చార్టర్, 1928లో హైకోర్టు యాక్ట్, స్వాతంత్ర్య అనంతరం హైకోర్టు ఆఫ్ హైదరాబాద్, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏపీ హైకోర్టుగా మారింది. ఆ తర్వాత 2014 జూన్ 2న రాష్ట్ర విభజనతో... ఏపీ, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. ఏపీకి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటయ్యాక... ఈ ఏడాది జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంగా సేవలందిస్తోంది.
హాజరుకానున్న న్యాయమూర్తులు
వందేళ్ల సందర్భంగా హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం జరగనున్న ఉత్సవాలకు సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, ఇతర న్యాయమూర్తులు హాజరు కానున్నారు.
హైకోర్టు భవన చరిత్రలో 2009 ఆగస్టు 31న జరిగిన భారీ అగ్నిప్రమాదం విలువైన ప్రతులు ఆహుతైపోయాయి. లైబ్రరీ హాలులో విలువైన, అరుదైన లా రిపోర్టులు, జర్నల్స్ దగ్ధమైపోయాయి. అనంతరం అదే రూపంలో లైబ్రరీ భవనాన్ని పునరుద్దరించి 2011 అక్టోబరు 13న ప్రారంభించారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు