సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు.’’
‘‘పవన్‌కల్యాణ్‌కు పాజిటివ్ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు’’ అని జనసేన పార్టీ తెలిపింది.
ఇదీ చదవండి: రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీలో సేవలు