అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌అర్బన్, గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.
నిలిచిపోయిన రాకపోకలు
- బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జల్లా బూర్గంపాడులో 17 సెం.మీ. వర్షం కురిసింది. ఇదే జిల్లా వెంకటాపురంలో 15 సెం.మీ. పాల్వంచలో 14, భద్రాచలంలో 13, కొత్తగూడెం, జూలూరుపాడు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 10, బయ్యారం, గార్లలలో 9 సెం.మీ. వర్షం కురిసింది. జంట నగరాల్లోనూ గురువారం పగటి పూట జల్లులు కురుస్తూనే ఉన్నాయి.
- వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 19.6 అడుగులు దాటింది. తాలిపేరు జలాశయం 18 గేట్లు ఎత్తి 61 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.
- భద్రాచలంలో బుధవారం రాత్రి 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. గురువారం సాయంత్రం 5 గంటలకు 35.5 అడుగులకు పెరిగింది. స్నానఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి. సింగరేణి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మేడిగడ్డ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,18,100 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా.. 57 గేట్లను ఎత్తి 3,21,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం బ్యారేజీలో 8.4 టీఎంసీల నిల్వ ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 8.0 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది.
మళ్లీ.. దిగివస్తున్న కృష్ణమ్మ
ఎగువ కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. నారాయణపూర్ నుంచి దిగువకు 1.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఆలమట్టి నుంచి కూడా భారీగా నీరు విడుదలవుతోంది. జూరాలకు గురువారం ఉదయం 43 వేల క్యూసెక్కులు వస్తుండగా రాత్రి 9 గంటల సమయానికి 89 వేల క్యూసెక్కులు పెరిగింది. మరో మూడు రోజుల్లో తుంగభద్ర జలాశయం నిండనుంది. 9 టీఎంసీలు చేరితే గేట్లు ఎత్తనున్నారు. శ్రీశైలానికి 55 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా విద్యుత్తు ఉత్పత్తితో నాగార్జునసాగర్‌కు 40,259 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
గోదారి ముంచెత్తినా.. ఆ దారినే పయనం
జగిత్యాల జిల్లా సరిహద్దున రాయపట్నం వంతెన వద్ద గోదావరిలో గురువారం సాయంత్రం నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఎగువన వర్షాలకు తోడు గోలివాడ పార్వతి పంప్‌హౌస్ నీటిని ఎత్తిపోయడంతో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ఇక్కడ పాత వంతెనపై ఒక అడుగు ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ప్రమాదమని తెలిసినా కొందరు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఈ వంతెన మీదుగానే ప్రయాణిస్తున్నారు.