Heavy rains in telangana:రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.... ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో.. ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లాలో ఐదోరోజూ జోరు వర్షమే కురిసింది. పల్లె, పట్టణమనే తేడాలేకుండా అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. అత్యధికంగా కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా మామడ మండలంలో 16.24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ సమీపంలోని నాగాపూర్ వంతెనపై వరద పొంగిపొర్లడంతో ఆదిలాబాద్-మంచిర్యాల మార్గంలో రవాణా స్తంభించింది. ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణిని ప్రసవంగా కోసం ఆదిలాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో.. వాగుపొంగిపొర్లడంతో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అతికష్టంమీద ఆమెను రిమ్స్‌కు తరలించారు. నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూసాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బయటకు రాని పరిస్థితి: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా వర్షం కురుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. తిమ్మాపూర్ మండలంలోని నెదునూరులో దెబ్బతిన్న ఇళ్లను.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్‌లోని స్వప్న కాలనీలో మురికి కాలువలు సరిగా లేక ఇళ్లల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఇంట్లోని సామాన్లు నీట మునిగాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై పలుచోట్ల వర్షపునీరు ప్రవహిస్తుండటంతో... వాహనచోదుకులు ఆందోళన చెందుతున్నారు. సుగ్లాంపల్లితోపాటు రంగంపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో... వాహనదారులు రోడ్డుపై నుంచి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
చెరువులను తలపిస్తోన్న రహదారులు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో... వరంగల్ నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ చౌరస్తా రహదారితో పాటు స్టేషన్ రోడ్‌లో వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరికవాడతోపాటు మైసయ్యనగర్‌లో వరద నీరు రోడ్డుపై నిలవడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాయపర్తి మండలకేంద్రం, గన్నారంలో పలు చోట్ల ఇళ్లు కూలిపోయి... ప్రజల నిలువ నీడను కోల్పోయారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి, ఇందిరానగర్‌లో... ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల దాటికి పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి.
రాకపోకలకు ఇబ్బందులు: భూపాలపల్లి, ములుగు జిల్లాలపై వరుణుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల రాకపోకలకు తెగిపోయాయి. గణపురం మండలం మోరాంచ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో.. మొరంచలోని వైకుంఠధామం మునిగిపోయింది. చెల్పూర్ నుంచి పెద్దాపూర్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గణపురం, కొండాపురం మధ్య వాగు రావడంతో సీతారాంపురం, అప్పయ్యపల్లె, గుర్రంపేట వాసులు.. మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలోనే బాంబులగడ్డ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. భూపాలపల్లి ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరి జలమయమయ్యింది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. నాలుగు రోజులుగా పలిమేల మండలానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం తాగడానికి మంచి నీరు దొరకని పరిస్థితి నెలకొంది. మహాముత్తరాం మండలంలో వాగులు ఉద్ధృతికి పలు ప్రధాన రహదారులు సైతం కొట్టుకుపోయాయి. గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో.. అటవీప్రాంతాల్లో ప్రజలు డేరాలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
కూలీన ఇల్లు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు... నాగర్‌కర్నూల్ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న నివాస గృహాలు, మట్టిమిద్దెలు కూలిపోతున్నాయి. కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల, ఎల్లూరు, పానుగల్ మండలంలో వివిధ గ్రామాలలో ఇల్లు కూలిపోయాయి. కొల్లాపూర్ మండలం యన్మన్ బెట్లలో పుట్ట ఎల్లయ్య ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో బంధువు చనిపోతే ఇంట్లో ఉన్న ఆరుగురు చూడడానికి వెళ్లేసరికి... ఇల్లు కూలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. కూలిపోయిన ఇంటిని పరిశీలించారు.
సిద్దిపేటలో మంగళవారం ఒక వృద్ధుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా.. శౌచాలయం గోడ కూలడంతో మృతి చెందాడు. స్థానిక లింగారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన పడిగెల రాంరెడ్డి (73) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలోని శౌచాలయానికి వెళ్లాడు. వర్షాలకు బాగా నానిపోయిన మరుగుదొడ్డి గోడ అతడిపై కుప్పకూలింది. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ గ్రామంలో అత్యవసర చికిత్స అందక మంగళవారం ఓ యువకుడు మృతిచెందాడు. ఐలాపూర్ గ్రామానికి చెందిన పీరీల సమ్మయ్య (30)కు మంగళవారం విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. అతడిని ఆసుపత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ గ్రామం చుట్టూ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ముందుకు వెళ్లలేక ఇంటికి తీసుకువచ్చేశారు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేవారు కూడా లేకపోవడంతో సమ్మయ్య మృతిచెందాడు.
గోదావరిలో చిక్కిపోయి: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గోదావరిలో చిక్కుకుపోగా.. అధికారులు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. గోదావరి మధ్యలో ఉండే ద్వీప ప్రాంతంలో సాగు చేసుకునే మూడు కుటుంబాల వారు వారం రోజుల కిందట అక్కడికి వెళ్లారు. వరద పెరగడంతో బయటకు రాలేకపోయారు. దీంతో జగిత్యాల కలెక్టర్ రవినాయక్, ఎస్పీ సింధూశర్మలు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపించారు. రెండు పడవల్లో అందరినీ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
విలేకరి గల్లంతు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో 9 మంది కూలీలు జల దిగ్బంధంలో చిక్కుకోగా...వార్తాసేకరణకు వెళ్లిన ఓ టీవీ ఛానల్ స్థానిక విలేకరి మంగళవారం రాత్రి వరదలో గల్లంతయ్యారు. జగిత్యాలకు చెందిన విలేకరి జమీర్ తన మిత్రుడు సయ్యద్ అర్షాద్ అలీతో కలిసి బోర్నపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రామాజీపేటకు వెళ్లే బైపాస్ రహదారి గుండా వస్తుండగా భూపతిపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. కారు నడుపుతున్న అర్షాద్ సురక్షితంగా బయట పడగా జమీర్ కారుతో గల్లంతయ్యారు. గ్రామస్థులు, పోలీసులు గాలిస్తున్నారు.
మంత్రి సమీక్ష: భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి , పంట నష్టం జరగకుండా చూడాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 5రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని... ప్రసవానికి ఉన్న గర్భిణీలు, డయాలసిస్ పేషెంట్లను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బయ్యారం మండలం లోని పలు గ్రామాల్లో వరద పరిస్థితిని మంత్రి పరిశీలించారు.