జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయయ్యాయి. రహదారులపై గుంతల్లో నీరు చేరి కనిపించకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. హన్మకొండ, కాజీపేటలో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా... ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీల్లోకి నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నీళ్లలోనే ఉండిపోయామని వాపోయారు.
చెరువులు, కుంటలు అలుగు
ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. కొత్తగూడ అడవి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు బొగ్గుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. వెంకటాపూర్ మండలం రామప్ప సరస్సులోకి 29.5 అడుగుల నీటిమట్టం చేరుకుంది.
నీట మునిగిన నాట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 80 శాతం చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరి నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయి. చెరువులు అలుగు పోస్తుండగా.. కాలువల వద్ద మత్స్యకారులు చేపలు పడుతున్నారు.
ఉద్ధృతంగా మున్నేరు నది
ఖమ్మంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వీధులన్నీ బురదమయం అయ్యాయి. నగర వాసులు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాపర్తి నగర్, టీఎన్జీవో కాలనీ, దానవాయిగూడెం, సుందరయ్యనగర్, ప్రకాశ్ నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
రాకపోకలకు అంతరాయం
దేవాదుల పైప్‌లైన్ల ద్వారా విడుదల చేస్తున్న నీటితో వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ జలకళ సంతరించుకుని నిండుకుండలా మారింది. చుట్టూ నీటి మధ్యలో పచ్చదనాన్ని పరుచుకున్న ఎత్తైన గుట్టలు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కొటపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వరద తాకిడికి నాగసమందర్, ధారూరు వంతెనకు గండిపడింది. రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దెముల్ మండలం మంచన్ పల్లి వంతెనకు సైతం గండిపడడం వల్ల తాండూర్- హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. తాండూరు వాసులు కొడంగల్, పరిగి మీదుగా ప్రయాణిస్తున్నారు.
ఇదీ చూడండి : అమీన్పూర్ ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు