తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రారంభమంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని కొంపల్లి, సుచిత్ర, చింతల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, సురారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్‌నగర్, కుషాయిగూడలో వర్షం కురిసింది. చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడెంలో భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, కాప్రా, కీసర, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కార్ఖానా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.
నైరుతి రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లా వరకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు, రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. రాష్ట్రంలోకి రుతువపనాల రాకతో వాతావరణం చల్లబడింది. రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే విధంగా గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఖమ్మంలో భారీ వర్షం.. ఒకరు మృతి
ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పల్లిపాడు వద్ద బైకుపై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు విరిగిపడింది. చెట్టుకొమ్మలు విరిగిపడడంతో మధుబాబు అనే యువకుడు మృతి చెందాడు.
ఇవీ చదవండి: