బిల్లుల బకాయిలు చెల్లించడం సహా వివిధ డిమాండ్లతో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల సేవలు నిలిపివేయడం వల్ల ప్రభుత్వం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. ఆగస్టు 15 నుంచి నిలిచిపోయిన సేవలు... ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి.
గొప్పగా అమలవుతోంది...
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు గొప్పగా అమలవుతున్నాయని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 85 లక్షల కుటుంబాలకు వర్తిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ వంద రెట్లు అమలవుతుందని తెలిపారు. రాబోయే కాలంలో ప్రతినెల బిల్లుల్లో కొంత మొత్తం చెల్లించాలని సంఘం కోరిందని... ఇది తప్పకుండా నెరవేరుస్తామని సమ్మె విరమణ అనంతరం సచివాలయంలో హామీనిచ్చారు. 2007-12 మధ్య జరిగిన MOUలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నెట్‌వర్క్ హాస్పిటల్ అసోసియేషన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వారు రోగులకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు ఈటల వెల్లడించారు.
తక్షణమే విరమిస్తున్నాం...
మంత్రితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు నెట్‌వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. ప్రతి ఆసుపత్రిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి చెప్పడం చాలా సంతోషకరమని... ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు రాకేశ్ పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణలో తామంతా భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కృషి వల్లే తమ సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న ఆసుపత్రులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు.
చర్చల అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర నెట్‌వర్క్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సంఘం ప్రకటించింది. ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరణతో నిరుపేద రోగులకు అవస్థలు తప్పనున్నాయి.
ఇవీ చూడండి: చంద్రయాన్-2: ఇస్రో సారథితో ఈటీవీ భారత్ ముఖాముఖి