Harish Rao on Vaccination: అన్ని కేటగిరీల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, జ్వర సర్వేపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని.. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఉపయోగపడిందని తెలిపారు.
harish rao on fever survey: ఫీవర్ సర్వేలో భాగస్వామ్యమైన అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి పైగా ఇళ్లలో ఫీవర్ సర్వే చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మొదటి రౌండ్ తర్వాత మరోసారి ఫీవర్ సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి 31 జిల్లాల్లో 100 శాతం టీకాలు వేశారని పేర్కొన్నారు. టీనేజర్లకు సైతం వందశాతం తొలిడోస్ పూర్తి చేసిన కరీంనగర్, హనుమకొండ జిల్లా అధికారులను మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.సుధీర, కరోనా నోడల్ ఆఫీసర్ డా.బాలాజీ, డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, సీహెచ్‌వోలు, పీహెచ్‌సీ డాక్టర్లు పాల్గొన్నారు.