రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ సరిగా లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలు ముందుకు పోకుండా కాళ్లలో కట్టె పెట్టినట్లున్నాయని విమర్శించారు. హైరిస్క్ కాంటాక్టు ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇతర దేశాల నుంచి భారతీయులను తీసుకువస్తున్నామన్నారు. విదేశాల్లో జైళ్లలో ఉన్నవారు ఇక్కడికొచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే 200 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయాని తెలిపారు. ప్రజల పట్ల ప్రేమ ఉంటే మాకు సరైన సూచనలు చేయండని హితవు పలికారు. నిజాయితీ ఉంటే వాస్తవాలను మాకు తెలియజేయండని కోరారు.
గాంధీ వైద్యుల సేవలను, కృషిని అందరూ అభినందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు కూడా గాంధీలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని గుర్తు చేశారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ, నీలోఫర్, పేట్లబురుజు, సుల్తాన్‌పూర్ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో కరోనా ప్రభావానికి గురైన వైద్య సిబ్బందికి చికిత్స అందిస్తున్నామన్నారు. కొత్తగా రాష్ట్రంలో 150 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. కేంద్రానికి 1000 వెంటిలేటర్లను కోరగా 50 పంపారని... త్వరలో మరో 950 వచ్చే అవకాశం ఉందన్నారు. వివిధ ఆస్పత్రుల్లో వైద్యులకు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: సమ్మర్ స్పెషల్: సోంపు షర్బత్ సింపుల్ రెసిపీ