కరోనా పేరుతో భాజపా అనవసర రాజకీయాలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వం విదేశాల నుంచి కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్లను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని విమర్శించారు. కరోనా చికిత్సకు ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం రూ. 214 కోట్లేనని తెలిపారు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులతో ఈటల సమీక్ష నిర్వహించారు.
కరోనా నియంత్రణకు, చికిత్సకు కేంద్రం నిధులు ఇవ్వకుండా.. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ.. చేతులు దులుపుకుందని ఈటల మండిపడ్డారు. కరోనా పేరుతో భాజపా నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయాన్ని గమనించకుండా.. స్థానిక నేతలు ఆందోళనలు చేయటం సరికాదని ఈటల హితవు పలికారు.
మరోవైపు వారం రోజుల్లోపు గచ్చిబౌలి ఆస్పత్రిని ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా లక్షణాలను కనుక్కొని పరీక్షలు చేయించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెకండరీ, టెర్షియరీ కేర్ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ల్యాబ్‌లలో వచ్చే వారం రోజుల్లో రోజుకు 6,600 పరీక్షలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి: బోధనతోపాటు పరిశోధనలపైనా దృష్టిసారించండి: గవర్నర్