Seasonal diseases:హైదరాబాద్లో రెండేళ్ల తర్వాత డెంగీ కోరలు చాస్తోంది. ఇతర సీజనల్ వ్యాధులు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ శ్రీహర్ష సూచించారు. వానాకాలంలో వచ్చే పలు వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
10 శాతం మందికే ఇబ్బంది: డెంగీ జ్వరంలో 90 శాతం మందిలో ఎలాంటి ఇబ్బందే ఉండదు. ప్లేట్‌లెట్స్ 10 వేల కంటే తగ్గడం, షాక్ సిండ్రోమ్‌లకు గురైనప్పుడే ప్రమాదకరంగా మారుతుంది. ఈడిన్ ఈజిప్టై దోమ కుట్టిన 3-7 రోజుల తర్వాత లక్షణాలు బయట పడతాయి. హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. కళ్ల వెనుక భాగంలో నొప్పి, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు(రాషెస్) వస్తాయి. డెంగీ నిర్ధారణ అయితే సరేసరి. లేదంటే మలేరియా ఇతర జ్వరాలుగా అనుమానించాలి.
కలుషితాహారంతో టైఫాయిడ్: ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 153 కేసులు నమోదయ్యాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. కలుషిత ఆహారం, నీళ్లు తాగితే వస్తుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, కడుపులో నొప్పి, వీరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తాయి.
పెరుగుతున్న కుక్క కాట్లు.. ఈ కాలంలో పాము, కుక్కకాట్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.కుక్క కరిచిన 24 గంటలలోపు రేబిస్ సోకకుండా టీకా తీసుకోవాలి. లేదంటే ముప్పుగా మారుతుంది. పాము కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
ఈ సూచనలు పాటించాలి.. మలేరియా, డెంగీ, చికెన్ గన్యా వ్యాధులు దాడి చేయకుండా దోమల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోడ్లపైన గుంతలు, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి.
ఒక ప్రాంతంలోని సామూహికంగా వాంతులు, విరేచనాలు, జ్వరాలు ప్రబలితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలి.