రాష్ట్రంలో కొవిడ్ రెండో దశ ఉద్ధృతి ఇంకా ముగిసిపోకుండానే ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంపై వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల పేరిట పెద్దఎత్తున జనం ఒకేచోటుకు చేరడం వల్ల తిరిగి కరోనా వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని భయం వ్యక్తమవుతోంది. వైరస్ తిరిగి ప్రబలకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడోముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో.. మరోవైపు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే ప్రజారోగ్యం పెను ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ భావిస్తోంది. కాలానుగుణ వ్యాధులతో పాటు రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యఆరోగ్యశాఖ తాజాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ఎందుకు మళ్లీ ఆందోళన?
రాష్ట్రంలో తొలి కరోనా కేసు గతేడాది మార్చిలో నమోదైనా.. మొదటి దశ కొవిడ్ విజృంభణ మాత్రం గతేడాది మే నుంచి సెప్టెంబరు వరకూ 5 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ 5 నెలల పాటు తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మార్చిలో రెండోదశ మొదలై మే వరకూ మూడు నెలల పాటు కొనసాగింది. జూన్ నుంచి తగ్గడంతో ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఈ క్రమంలో అధిక శాతం ప్రజల్లో ఇక కొవిడ్ భయం లేదనే భావనతో ప్రవర్తిస్తున్నారని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మార్చి-మే మాసాల్లో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించారు. జూన్ నుంచి మాస్కులు ధరించడాన్నీ ఎక్కువమంది పక్కనబెట్టారు. కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్‌లో ఒకరిపై ఒకరు ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. శుభకార్యాల్లో ఒకరిద్దరు మినహా అత్యధికులు మాస్కులు ధరించడంలేదు. అసలు 6 వారాల కిందటి పరిస్థితిని ఎప్పుడో మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.
బెడద ఇంకా తొలగిపోలేదు
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం వాస్తవమే అయినా.. వైరస్ బెడద ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ రోజుకు 700-800 వరకూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందులోనూ 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-6 శాతం కంటే అధికంగా నమోదవుతోందని తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదవుతునే ఉన్నాయి. మహారాష్ట్రలోనూ మళ్లీ వైరస్ విజృంభణ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలకు నీళ్లొదిలేయడం వల్ల తిరిగి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లడానికి అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నియంత్రణ మన చేతుల్లోనే
'నెలన్నర కిందటి వరకూ రాష్ట్రంలో రెండోదశ కరోనా మహమ్మారి బాధలు అనుభవించాం. ఈ విషయాలను అప్పుడే మరిచిపోవద్దు. తప్పనిసరిగా అంతా మాస్కులు ధరించాలి. అలా చేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు దాదాపుగా లేనట్లే. పని ప్రదేశాల్లోనూ మాస్కులు తీయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదు. కేవలం కుటుంబ సభ్యులతోనే పండుగలు, శుభకార్యాలు జరుపుకోవాలి. చేతులను తరచూ శుభ్రపరచుకోవాలి. అర్హులైన వారందరూ సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా టీకాలు పొందాలి. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలూ సహకరించాలి.'
-డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఇదీ చూడండి: Agriculture: మూడేళ్లలో 38% పెరిగిన పంటల సాగు వ్యయం