తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి ఆశయాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా కృషి చేస్తామని మంత్రులు నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో "తెలుగు జాతి వికాసం-జర్నలిజం పాత్ర" పై జరిగిన సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. మే 28న రవీంద్రభారతిలో సురవరం ప్రతాప రెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే ఏమిటో నేర్పించిన తొలి తెలంగాణ ఉద్యమకారుడు సురవరం అని మంత్రులు కొనియాడారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితునిగా, రచయితగా అన్ని రంగాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనలో తన కలం ద్వారా ప్రజలను చైతన్య పరిచి, ధైర్యాన్ని ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని ప్రశంసించారు.
తెలంగాణ కవులను చిన్న చూపు చూస్తున్న రోజుల్లో తన రచనలతో సురవరం చురకలు అంటించే వారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడు పురుడు పోసిన జర్నలిజం వ్యవస్థలో.. ఆయన విలువలను నేటి జర్నలిస్టులు అనుసరించాలని సూచించారు. సమాజానికి ఏదైనా రోగం వస్తే ... దానికి మందుగా జర్నలిజం పనిచేయాలని కోరారు. ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపుతూ, సమాచారాన్ని, సలహాలను ఇస్తూ... జర్నలిజం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని... ఆ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నేషనల్హై వేపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: చిన్నారులపై కరోనా పడగ.. అప్రమత్తతే ఆయుధమని సూచన