ఇంట్లోనే ఉన్నప్పటికీ వైరస్ సోకింది !
లాక్‌డౌన్‌లో సడలింపులు మొదలయ్యాక కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సినిమా షూటింగులు కూడా ప్రారంభం కావడంతో ఇప్పటికే చాలామంది బుల్లితెర నటీనటులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక వెండితెరకు సంబంధించి కరోనా బాధితుల జాబితాలో రాజమౌళి, తేజ లాంటి దర్శకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది స్మిత.
కరోనాను జయించి, ప్లాస్మాను దానం చేస్తాం !
నిన్న నిజంగా దుర్దినం. ఒళ్లు నొప్పులు నన్ను తీవ్రంగా బాధించాయి. బహుశా ఎక్కువ సేపు వర్కవుట్లు చేయడం వల్లనే ఈ ఒళ్లు నొప్పులు మొదలయ్యాయని అనుకున్నా. కానీ ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందులో నా భర్త శశాంక్‌కు, నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మాకెలాంటి లక్షణాలు లేవు. ఈ కరోనా వైరస్‌ను కాలితో తన్నేసి, ప్లాస్మా దానం చేసేందుకు ఎదురుచూస్తున్నాం. మేం ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్నాం. అయినా కరోనా మా ఇంటికి వచ్చింది’ అని రాసుకొచ్చారీ స్టార్ సింగర్.
150 రోజులు అడుగు బయట పెట్టలేదు.. అయినా !
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు స్మిత దంపతులు. ఈ క్రమంలో- స్మిత మాట్లాడుతూ - ‘నేను 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాను. నా భర్త శశాంక్ కూడా మార్చి ప్రారంభం నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా నివారణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా కరోనా మహమ్మారి మా ఇంటికి వచ్చింది. ఇటీవల ఎలక్ట్రిక్ పనుల కోసం మా ఇంటికి ఓ ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అయితే అతనికి కరోనా సోకిందని తర్వాతే మాకు తెలిసింది. బహుశా అతని కారణంగానే మాకు కూడా ఈ మహమ్మారి సోకిందని అనుకుంటున్నాం’ - అని చెప్పారు.
ఒంటి నొప్పులతో మొదలై !
4 రోజుల క్రితం నేను సుదీర్ఘ సమయం పాటు వ్యాయామం, వర్కవుట్లు చేశాను. అదే సమయంలో ఒళ్లు నొప్పులు నన్ను తీవ్రంగా బాధించాయి. అయితే ఎక్కువ సేపు వర్కవుట్లు చేయడం వల్లనే ఈ ఒళ్లు నొప్పులు మొదలయ్యాయని అనుకున్నా. శరీరమంతా చాలా నిస్సత్తువగా అనిపించింది. అదే సమయంలో మా ఇంటికొచ్చిన ఎలక్ట్రీషియన్‌కు కరోనా సోకిందని నాకు గుర్తొచ్చింది. దీంతో నేను, నా భర్తతో పాటు మరో పదిమంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాం. అందులో మా ఇద్దరికీ కరోనా సోకిందని తేలింది. అదృష్టవశాత్తూ మా తొమ్మిదేళ్ల కూతురు శివీకి నెగెటివ్ అని వచ్చింది. కొద్ది రోజుల పాటు తనకు దూరంగా ఉండాలి. అయితే అది ఎంతో కష్టమైన పని. ఎందుకంటే శివీకి ప్రతిరోజూ నా పక్కనే పడుకునే అలవాటుంది. కరోనా అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు నా కూతురుకి ఉంది...అయితే నా నుంచి దూరంగా ఉండాలంటే మాత్రం తను తట్టుకోలేదు. అదృష్టవశాత్తూ మా అమ్మ వచ్చి శివీని తనతో పాటు విజయవాడ తీసుకెళ్లిపోయింది. త్వరలోనే నేను కరోనాను జయిస్తాను. మళ్లీ మనసారా నా కూతురుని హత్తుకుంటాను’ అని ధీమాగా చెప్పుకొచ్చిందీ స్టార్ సింగర్.
ఇవీ చూడండి : పుషప్‌లు చేస్తూ 81వ పుట్టినరోజు చేసుకున్న బామ్మ!