రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసుకుంటున్నామని తెలిపారు. అధునాతన వైద్య పరికరాలను ఆసుపత్రుల్లో సమకూర్చుకుంటున్నామన్నారు. కొత్తగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రుల అవసరం మేరకు 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్లను కేటాయించినట్లు వివరించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.
అన్ని వేళలా ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్న మంత్రి..స్పెషాలిటీ సేవలు సైతం జిల్లా పరిధిలోనే ప్రజలకు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలన్న మంత్రి.. అవయవదానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: