Harish rao Review On Power: తెలంగాణ ఏర్పడితే చీకట్లే అన్న మాటలు తప్పని నిరూపిస్తూ.. నేడు నిరంతర విద్యుత్‌తో వెలిగిపోతోందని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ విద్యుత్ ఒప్పంద సామర్థ్యం 7వేల 778 మెగావాట్లు ఉండగా గడిచిన ఏడేళ్లలో 16వేల 623 మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. ఏడేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టీకరణ కోసం 33వేల 722 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. విద్యుత్ శాఖ తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇటీవలే ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ఈఆర్సీకీ సమర్పించాయి.
Harish on power company's: విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ - వ్యయాల వ్యత్యాసం ఆ సంస్థలపై ప్రభావం చూపుతుందని వివరించాయి. ఈ లోటు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు చర్చించారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ల రెవెన్యూ లోటు 2021-22 ఏడాదికి రూ.10,624 కోట్లు, 2022-23కి 10,928 కోట్లు వచ్చినట్లు సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. బొగ్గు ధరలు, క్లీన్ ఎనర్జీ ఛార్జీల పెరుగుదల, ఉద్యోగులకు రెండు సార్లు వేతన సవరణ, మూడేళ్లుగా ఛార్జీలు పెంచకపోవడం వంటి కారణాలతో రెవెన్యూలోటు పెరిగినట్లు వివరించారు. గత నాలుగేళ్లలో కేవలం ఉద్యోగుల వేతనాలే సుమారు రూ.5 వేల కోట్లకు చేరుకున్నాయని డిస్కంల సీఎండీలు, ట్రాన్స్-కో జెన్కో సిఎండీ ప్రభాకర్ రావులు మంత్రులకు వివరించారు.
రైల్వేపై మంత్రి సమీక్ష
Harish Rao review on railways: మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే పనులు వేగవంతం చేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్వోబీలు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లు సంబంధించి స్థల సేకరణ, చెల్లించాల్సిన పరిహారం గురించి మండలాల వారీగా అరణ్య భవన్‌లోని మంత్రి కార్యాలయంలో సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్, అర్అండ్బీ, రైల్వే శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వమే రైల్వే శాఖకు ఉచితంగా స్థలాన్ని అందచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
railway projects: సిద్దిపేట జిల్లాలో 1,421 ఎకరాలకు గానూ.. 1,315 ఎకరాలు సేకరణ, మెదక్ జిల్లాలో 174 ఎకరాలకు గానూ.. 172 ఎకరాలు సేకరణ పూర్తయిందని అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లాలో భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే వేగంగా స్థల సేకరణ చేసిందో.. అదే విధంగా రైల్వే పనులు వేగవంతం చేయాలని సూచించారు. త్వరితగతిన రైలు మార్గాలను పూర్తి చేసి, జనవరి వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని డివిజనల్ రైల్వే మేనేజర్‌ను మంత్రి కోరారు. సంబంధిత ఇతర శాఖల అధికారులు కూడా సహకరించి పనులు త్వరితగతిన అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.