Govindananda Saraswati on Anjanadri : హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని... కర్ణాటక రాష్ట్రం కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే జన్మించారని హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రథయాత్ర వాహనాన్ని ఆయన తిరుపతిలో ప్రారంభించారు.
తితిదే దైవద్రోహం చేస్తోంది...
తితిదే దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. తితిదే పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను తితిదే మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి పేరుతో నిర్మాణాలు చేయడం ద్వారా.. దుకాణాలు ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించేందుకు తితిదే ప్రయత్నిస్తోందని విమర్శించారు. 1200 కోట్ల రూపాయలతో కిష్కింధను అభివృద్ధి చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని ప్రజలకు తెలియజేసేందుకు హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
శృంగేరి జగద్గురువుల సాన్నిధ్యంలో కూడా చర్చ జరిగింది. హనుమంతుల వారు అంజనాద్రిలో పుట్టలేదని అంతిమ నిర్ణయం వచ్చింది. తిరుపతిలో ఉన్నటు వంటి అంజనాద్రి అనేది అభూత కల్పన. ఇది ధార్మిక విషయం కాబట్టి ధర్మాచార్యులు చెప్పాలి. ధర్మాచార్యులు ఎవరు... పూరీ వారు, ద్వారక వారు రామానుజాచార్యుల వారు.. ఆచారులందరూ తేల్చి చేసిన నిర్ణయం ఏమిటంటే.. కిష్కిందలో మాత్రమే అంజనాద్రి పర్వతం ఉన్నది.. పంపా క్షేత్రం కిష్కిందలో హనుమంతుల వారు పుట్టారనేటువంటిది రామాయణ, అనేక పురాణాల ప్రకారంగా ఆచార్యులు సమ్మతించి నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ మేము చెబుతున్నాము. తిరుమల తిరుపతి కమిటీ వారు చేసింది ఏమిటంటే.. వాళ్లందరూ కావాలని పుస్తకాలు రాసి.. ఒక నకిలీ ఇతిహాసాన్ని సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించి కాంట్రాక్టుల పేరుతో అక్కడేవో కట్టడాలు కట్టుకోవాలని అనుకుంటున్నారు. అదంతా ఈ రోజుతో సమాప్తి. -గోవిందానంత సరస్వతి, హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు
ఇదీ చూడండి : మహిమ గల గట్టమ్మ తల్లి.. గేట్ వే ఆఫ్ మేడారం