Guvvala Balaraju on Yesterday Achampet Attacks : నిన్న రాత్రి బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన అచ్చంపేట(Achampet Attacks ) ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ.. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి కారుని అడ్డుకుని తనపై, తన అనుచరులపై దాడి చేశారని.. ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బతికి బయటపడ్డానన్నారు.
దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే : కేటీఆర్
తనపై గతంలోనూ కాంగ్రెస్(Congress) అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించారని పేర్కొన్నారు. రాత్రి కూడా వంశీకృష్ణనే దాడలు చేయించినట్లు దుయ్యబట్టారు. ప్రాణం ఉన్నంత వరకూ ప్రజల కోసమే పోరాడుతానని.. అచ్చంపేట ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పగలు, ప్రతీకారం తన సంస్క్రతి కాదని.. రాజకీయాలలో వ్యక్తిగత దాడులు సరికాదన్నారు. రాత్రి ఘటనాస్థలిలో వంశీకృష్ణ లేడని అబద్ధాలు చెబుతున్నారని.. తనపై దాడి జరగవచ్చని 10 రోజుల క్రితమే పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు. కాంగ్రెస్ గుండాలకు ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. పగ, ప్రతీకారాలకు పోవద్దని సహనంతో ఉండాలని అనుచరులకు విజ్ఞప్తి చేశారు.
"నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక అంతమొందించేందుకు కుట్రపన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నాపై దాడులు చేశారు. ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బతికి బయటపడ్డాను. నాపై దాడి జరగవచ్చని పది రోజుల క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశాను. నాపై జరిగిన దాడులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు". - గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే
KTR visits Guvvala Balaraju in Hospital : అర్ధరాత్రి అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయాలపాలైన బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్(KTR) పరామర్శించారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో ఉన్న బాలరాజును కలిసి దాడి జరిగేందుకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని హెచ్చరించారు. ఇంతకింత అనుభవించాల్సి వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Clash Between BRS Congress Leaders at Achampet : అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అచ్చంపేటలో ఓ కారును హస్తం శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజు డబ్బు తరలిస్తున్నారని వారు ఆరోపిస్తూ.. వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్- ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు