ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్ యూకేలో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. బేజింగ్ స్టోక్ వ్యాయవ్య నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరపున పోటీచేసి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధిగా గెలిచారు. ఓ తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా గెలవటం ఇదే మొదటిసారి. అరుణ్.. ఈ పదవిలో నాలుగేళ్లపాటు కొనసాగుతారు. అలాగే బారో కౌన్సిల్ సభ్యునిగానూ ఆయన విజయం సాధించారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. 2 పదవులు ఒకేసారి చేపట్టే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా.. తెలుగువాడిగా గర్విస్తున్నానని అరుణ్ తెలిపారు.
అరుణ్ స్వస్థలం రేపల్లె మండలం.. మైనేనివారిపాలెం. అతని తండ్రి వెంకట్రావు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి గృహిణిగా ఉన్నారు. అమ్మమ్మ ఊరు మోపర్రులో పాఠశాల విద్యను అభ్యసించిన అరుణ్...హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో సీఎంసీ సంస్థలో ఉద్యోగిగా చేరి ఆ సంస్థ సిఫార్సు మేరకు 2010లో అరుణ్ యూకే వెళ్లారు. అక్కడ మోటరోలా కంపెనీలో పని చేశారు. తర్వాత సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించారు. బ్రిటన్ రక్షణశాఖ సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుమారుడి విజయం పట్ల.. తల్లి కృష్ణ కుమారి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బంధనంలో భారత్- ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా?