కరోనా మృతుల అంత్యక్రియల నిర్వహణపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. మృతదేహాల నుంచి మహమ్మారి వ్యాపించదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలలో స్వయంగా జేసీనే పాల్గొన్నారు. కొవిడ్ సోకటం వల్ల కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి గుంటూరు బొంగరాలబీడు శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ తంతులో జేసీ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.
అపోహలు వద్దు
కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహంపై హైపోక్లోరైడ్ ద్రావణం చల్లి, బ్యాగ్‌లో ప్యాక్‌చేసి అందిస్తారని జేసీ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని పట్టుకుని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. పాజిటివ్ వ్యక్తి మృతదేహాన్ని సమీపం నుంచి చూసినా, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంటే వైరస్ సోకదన్నారు. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించకపోవటం మానవత్వానికే మచ్చగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాజిటివ్ వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై ప్రజల్లోని అనవసర భయాందోళనలు, అపోహాలు పొగొట్టడం కోసమే అంత్యక్రియల్లో తాను స్వయంగా పాల్గొన్నానన్నారు. కొవిడ్‌తో మరణించిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్