ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడి పోతుండడం వల్ల నిరాశ్రయులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి దయనీయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ ఓ ప్రయత్నం చేపట్టింది. 2021 ఏడాది మొదటి రోజున ఓ సామాజిక సంస్థను ఏర్పాటు చేసింది. సామాజిక సేవ దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు ప్రేమతో అని పేరు పెట్టారు. గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపంలో దీనిని అమలు చేస్తున్నారు.
గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారీ ఈ నెల 1న ప్రేమతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంతకల్ రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్డు వద్ద సేవా సంస్థ వేదికను ఏర్పాటు చేశారు. బట్టలు, దుప్పట్లు, చలి నుంచి రక్షణ పొందే వస్త్రాలు వ్యక్తిగత, ఇతర అవసరాలకు పని కొచ్చే వస్తువుల సేకరణకు సంబంధించిన అంశాలపై తివారి రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు.
డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చిన ఈ పిలుపుకు స్పందించిన ప్రజలు అధిక సంఖ్యలో ముందుకొచ్చి సంస్థకు అనేక విరాళాలను అందజేశారని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. దుస్తులు, ఇతర అవసరమైన సామగ్రి, కావాల్సిన నిరుపేదలు ఇక్కడికి వచ్చి వారికి అవసరమైన వాటిని తీసుకునే విధంగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. స్పందించిన రైల్వే అధికారులు, సిబ్బంది సుమారు వివిధ రకాల బట్టలను సేకరించారు. వాటిని అవసరమైన పేదలు అక్కడికి వచ్చి తీసుకెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది. మొదటి, రెండో రోజు 300 మందికి పైగా ప్రజలు ప్రేమతో ప్లాట్ ఫారంలో ఉన్న వాటిని తీసుకెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చూడండి : 'సంక్షోభంలో వ్యవసాయం.. కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యం'