సుధీర్ఘ చారిత్రక నేపథ్యం.. భాగ్యనగరంలోనే అత్యంత పురాతనమైన విద్యాలయాల్లో ఒకటిగా పేరొందింది ప్రభుత్వ అలియా బాలుర హైస్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల. నవాబుల పిల్లల నుంచి గరీబోళ్ల బిడ్డల వరకు వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పింది ఈ విద్యా సంస్థ. ప్రభుత్వ అలియా మోడల్ పాఠశాల ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తైన శుభ సందర్భంగా గన్‌ఫౌండ్రిలోని ఆ పాఠశాలలో వేడుక నిర్వహించారు. బడి ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా సాగింది.
1971లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులతో పాటు ఐఏఎస్ అధికారి సయ్యద్ రఫత్ అలీ సహా 26 మందితో కూడిన నిర్వాహక కమిటీ చేయగా.. సయ్యద్ బష్రత్ అలీ నేతృత్వం వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కుటుంబం, వృత్తి జీవితం, విశ్రాంత జీవితం, ఇతరత్రా అన్ని రకాల అంశాలపై మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఏళ్ల తర్వాత కలుసుకుని.. ఆత్మీయత ఉట్టిపడటంతో ఒక్కొక్కరూ చలించిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. ఆనాటి గుర్తులను నెమరవేసుకున్నారు.
సుమారు 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులతో పాఠశాల కళకళలాడింది. వారు చదువుకున్న తరగతుల్లో కూర్చుని.. కలిసి భోజనం చేశారు. కుటుంబ పరిస్థితులు ఒకరికొకరు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ఆద్యాంతం ఉత్సాహంగా గడిచిపోయింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొందరు కుటుంబసభ్యులతో వచ్చి.. చిన్ననాటి మిత్రులను పరిచయం చేశారు.
బడి అంతా తిరుగుతూ ఆ నాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థులు. కార్యక్రమం అనంతరం గురువులను ప్రత్యేకంగా సన్మానించారు.
ఇవీ చూడండి..
45 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వవిద్యార్థులు.. ఒకే వేదికపై 108 మందికి షష్టిపూర్తి
వరంగల్ నిట్‌లో సాంకేతిక ఫెస్ట్.. పూర్వ విద్యార్థుల కోటి విరాళం