గులాబ్ తుపాన్ (Gulab Cyclone) వల్ల మంచిర్యాల జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరటంతో ప్రజలు ఆందోళన చెందారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు నిజామాబాద్‌లోని రోడ్లు కోతకు గురయ్యాయి. కుంటలు, చెరువు కట్టలు తెగిపోయి పంటలు నీట మునిగాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెనలు కూలి రాకపోకలు స్తంభించాయి. సిరికొండ మండలం కొండాపూర్, తుంపల్లి పరిధిలో కూలిన రెండు వంతెనల్ని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి (Rtc Chairman Bajireddy Govardhan Reddy) పరిశీలించారు.
కన్నీరు...
గులాబ్ తుపాన్ (Gulab Cyclone) రైతులకు కన్నీరునే మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంట నీట మునిగింది. ఏం చేయాలో దిక్కుతోచడంలేదనే నిర్వేదాన్ని అన్నదాతలకు మిగిల్చింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడకు చెందిన కుంట నర్సింగ్... సుమారు నాలుగు లక్షలు అప్పు చేసి నాలుగెకరాల్లో పత్తి పంట వేశాడు. రెండ్రోజుల వర్షానికి పూర్తిగా నీట మునగటంతో బోరున విలపించారు.
జలకళ...
వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలపై మహబూబాబాద్‌లో అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఖానాపురం మండలం పాకాల సరస్సు 30 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి పారుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని జాతీయ రహదారిపై కటాక్షాపూర్ చెరువు అలుగు పారుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రైతుల ఆవేదన...
అకాల వర్షం కారణంగా రిజర్వాయర్ కాల్వల నుంచి వరద నీరు పంట పొలాల్లోకి వచ్చి చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం శివారులో వరదనీరు కాల్వలోకి రావటంతో లైనింగ్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే కాల్వ లైనింగ్ దెబ్బతినడం పనుల నాణ్యతకు అద్దం పడుతుందని స్థానికులు ఆరోపించారు.
పనులకు ఆటంకం...
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు- మోరిపిరాల- కొరటికల్ గ్రామాల మధ్య ఉన్న బిక్కేరు వాగును ఆత్మకూరు తహశీల్దార్ జ్యోతి పరిశీలించారు. గులాబ్ తుపాన్ కారణంగా యాదాద్రిలో పనులకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా మధిరలో వైరానదితో పాటు ఎర్రుపాలెం మండలంలో కట్టలేదు ముదిగొండ చింతకాని మండలంలో మున్నేరులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
పూజలు...
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వనదుర్గా మాత కాపాడాలని కోరుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఏడుపాయల్లో పూజలు చేశారు. మంజీరా ఉద్ధృతిని పరిశీలించిన ఆమె... అమ్మవారి ఆలయం ముందు నుంచి ప్రవహిస్తున్న నదికి గంగాహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: