Gujarat Exam Question Paper Leaked in Hyderabad: గుజరాత్ పంచాయతీరాజ్ జూనియర్ క్లర్క్ ఉద్యోగాల పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో హైదరాబాద్ వాసుల ప్రమేయముందని తేలింది. 1181 పోస్టులకు సుమారు 9 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరీక్ష రాసేందుకు అభ్యర్ధులు కేంద్రాల వద్దకు చేరాల్సి ఉండగా, ఈలోపే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం బయటికొచ్చినట్లు గుర్తించారు. గుజరాత్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసు అధికారులు మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందుతుడు ప్రదీప్ నాయక్, కేతన్ బరోట్, హైదరాబాద్‌లోని ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి జీత్ నాయక్, బాస్కర్ చౌదరి, రిద్ది చౌదరి ఉన్నారు.
Gujarat Exam Question Paper Leaked: వీరులో పది మంది గుజరాత్‌కు చెందిన వారు కాగా, ప్రదీప్ నాయక్ ఒడిశా వాసి. ప్రదీప్ నాయక్ నుంచి రాబట్టిన సమాచారంతో ప్రశ్నాపత్రాల లీక్‌కు కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ సర్దార్కర్ రోహా సహకరించినట్లు నిర్దారించుకున్నారు. గుజరాత్‌కు చెందిన కేతన్ బరోట్ అక్కడ దిశా, ఇండోక్టినేషన్ కన్సల్టెన్సీల పేరుతో బోగస్ అడ్మిషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
జూనియర్ క్లర్క్ పోస్టులకు భారీ డిమాండ్ ఉండడంతో, దాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రశ్నాపత్రం లీకేజీకి తెరలేపాడు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆదివారం ఉదయం విమానంలో నగరానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులకు సహకారంతో కేఎల్ హైటెక్ ప్రింటింగ్ లిమిటెడ్ సంస్థలో సోదాలు నిర్వహించారు. ప్రింటింగ్ ఆపరేటర్ సర్దార్కర్ రోహతోపాటు జీత్ నాయక్ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రశ్నాపత్రాలు నగరంలో తయారవుతున్న విషయం ఎలా బయటకు వచ్చింది..? ప్రధాన నిందితులతో ఆపరేటర్‌కు ఉన్న సంబంధాలు, సర్వీసు కమిషన్ ఉద్యోగుల ప్రమేయం వంటి విషయాలపై వారు కూపీ లాగుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లోని కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీ చేసినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: