హైదరాబాద్ ప్రపంచంలోనే... గొప్ప ఐటీహబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 1500కు పైగా ఐటీ, ఐటీఆధారిత కంపెనీలు పనిచేస్తుండగా ప్రస్తుతం పశ్చిమభాగంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. లుక్‌ఈస్ట్ పాలసీ కింద మిగతాచోట్ల ఐటీ సేవల విస్తరణకు సర్కారు పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పశ్చిమం మినహా మిగతా చోట్ల ఏర్పాటుచేసే ఐటీ పార్కులు, సమూహాలు, పరిశ్రమలకు, పారిశ్రామిక రంగం నుంచి ఐటీకి మార్పిడయ్యే పార్కులు, పరిశ్రమలకు 2016 ఐటీ విధానం కింద అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలు వర్తిస్తాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాల మోతతో పాటు రాయితీలు వెనక్కి తీసుకోనున్నారు.
కార్యాలయం అద్దెపై రాయితీ
గ్రిడ్ ప్రయోజనాలు పొందేందుకు అర్హత పొందిన సంస్థలు విద్యుత్ వినియోగం విషయంలో... వాణిజ్య విభాగం నుంచి పారిశ్రామిక విభాగానికి మారవచ్చు. ఐదేళ్ల వరకు యూనిట్‌పై రెండు రూపాయల అదనపు విద్యుత్ రాయితీ, గరిష్ఠంగా ఏడాదికి 5 లక్షల వరకు పొందనున్నాయి. ఐటీ సంస్థలు కార్యాలయం అద్దెపై... ఐదేళ్ల వరకు 30 శాతం రాయితీ, గరిష్ఠంగా ఏడాది 10 లక్షల రాయితీ పొందనున్నాయి. గ్రిడ్ పాలసీ కేవలం.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకే వర్తిస్తుంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్ని యాంకర్ యూనిట్‌గా పరిగణించనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కంపెనీలు సహా కొత్త కంపెనీలు ఆ తరహా కేంద్రాలను నెలకొల్పినట్లైతే అందుకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సహకాల ప్యాకేజీని మంత్రివర్గం ఆమోదంతో అందివ్వనుంది. ఈ ప్రోత్సహకాలు 500 మందికి ఉపాధి కల్పించాకే విడుదలవుతాయిని గ్రిడ్ విధానం స్పష్టం చేసింది.
30 శాతం బేసిక్ రిజిస్ట్రేషన్
పారిశ్రామిక భూములను ఐటీ ఉపయోగానికి బదిలీచేసినట్లయితే అభివృద్ధి చేసిన మొత్తం భూ విస్తీర్ణంలో కనీసం 50 శాతం ఐటీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలి. మిగతా 50 శాతాన్ని వాణిజ్య, గృహ అవసరాలతోపాటు ఐటీయేతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఐటీ ఉపయోగంలోని 50 శాతం భూమిలో ఉద్యోగులకు కావాల్సిన ఫుడ్‌కోర్టులు, జిమ్, బ్యాంకులు, ఆసుపత్రి కోసం 5 శాతం వినియోగించుకోవచ్చు. విద్యుత్ మార్పిడి ప్రయోజనాలు సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లఘించినట్లైతే జరిమానాతోపాటు ఇచ్చిన ప్రోత్సహకాలను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూ మార్పిడికి సంబంధించి 30 శాతం బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం తీసుకోనుంది.
వృద్ధికి అనుగుణంగా మార్గదర్శకాలు
షీటీమ్స్, షీ షటిల్స్, సీసీటీవీ కెమెరాలు, విపత్తు స్పందన దళం, అగ్నిమాపక కేంద్రాలు ఐటీ వృద్ధికి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరం, తూర్పు, దక్షిణ ప్రాంతాల్ని ఐటీకి అనుగుణమైనవిగా ప్రమోట్ చేయాలని, యాంకర్ యూనిట్లను తీసుకొచ్చేందుకు ఐటీ విభాగం క్రియాశీలకంగా పనిచేయాలని నిర్దేశించుకుంది. హైసియా, నాస్కామ్, సీఐఐ తదితర పారిశ్రామిక సంఘాలతో పనిచేసి గ్రిడ్ ప్రాంతాల్లో సదస్సుల నిర్వహణకు ఐటీ విభాగం కృషి చేయాలని పేర్కొంది.
మరో ఐటీపార్కు
పారిశ్రామిక పార్కులను.. ఐటీ పార్కులగా మార్చాలని భావించిన సర్కారు... కూకట్‌పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, సనత్ నగర్, కాటేదాన్ పారిశ్రామిక పార్కులను ఆ జాబితాలో చేర్చింది. వాటి అదనంగా నగరానికి ఉత్తరాన కొంపల్లిలో ఐటీటవర్ అభివృద్ధి చేస్తారు. కొల్లూరు లేదా ఉస్మాన్‌సాగర్ పరిసరాల్లో మరో ఐటీపార్కును అభివృద్ధి చేస్తారు.
ఇదీ చూడండి : శంకుస్థాపన చేసిన రోజే.. 4 కంపెనీల ఒప్పందాలు