రాష్ట్రంలో జీఎస్టీ చెల్లించే లైసెన్సీలు 3 లక్షల 60 వేల వరకు ఉన్నారు. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వ్యాపార లావాదేవీల ఆధారంగా నెల నెలా రిటర్న్‌లు దాఖలు చేస్తాయి. సాధారణంగా ప్రతి నెల 85 శాతం వరకు రిటర్న్‌లు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ ఫిబ్రవరిలో జరిగిన వ్యాపార లావాదేవీలకు మార్చిలో రిటర్న్‌లు వేయాల్సి ఉండగా.. కేవలం 75 శాతమే దాఖలయ్యాయి. మార్చిలో జరిగిన వ్యాపార లావాదేవీలకు ఏప్రిల్ నెలలో రిటర్న్‌లు వేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ అమలులో ఉన్నందున కేవలం 7 శాతం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జూన్ వరకు వెసులుబాటు
మార్చి 20 వరకు వ్యాపార లావాదేవీలు సక్రమంగా కొనసాగినా.. కేంద్రం జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి జూన్ వరకు వెసులుబాటు ఇవ్వడం వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థలు చొరవ చూపలేదు. ఇందుకు తోడు లాక్‌డౌన్ కారణంగా నిత్యావసర సరకులు, పండ్లు, కూరగాయలు మినహా వ్యాపారలాదేవీలు స్తంభించాయి. మరోవైపు వ్యాట్ ద్వారా రావాల్సిన రాబడులకు కూడా గండిపడింది. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకాలపై 1000 నుంచి 1,500 కోట్లు రూపాయలు మేర వ్యాట్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం 500 కోట్లు లోపేనని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు కారణంగా మద్యం అమ్మకాలు పూర్తిగా స్తంభించడం వల్ల తద్వారా రావాల్సిన వ్యాట్ రాబడి రాలేదు. పెట్రోల్, డీజిల్ విక్రయాల ద్వారా ప్రతి నెల 800 నుంచి 1000 కోట్ల వరకు వ్యాట్ ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉంది.
చమురు సంస్థలు ఆడ్వాన్స్ చెల్లింపులు
ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన వ్యాట్ మొత్తాన్ని 2019-20 ఆర్థిక ఏడాదిలోకి వచ్చేందుకు వీలుగా మార్చిలోనే 800 కోట్లుకుపైగా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు చమురు సంస్థలు ఆడ్వాన్స్ చెల్లింపులు చేశాయి. ఒకవైపు లాక్‌డౌన్ కారణంగా వాహన రాకపోకలు ఆగిపోయి.. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు సాధారణ రోజుల కంటే దాదాపు 60శాతం తక్కువ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో వ్యాపారాలే జరగకపోవడంతో మే నెలలో రిటర్న్‌లు దాఖలు చేయడం సాధ్యం కాదు. అయితే కొందరు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా చెల్లింపులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా... ఏప్రిల్ నెలలో వ్యాట్, జీఎస్టీ ద్వారా రావల్సిన మొత్తాలు పూర్తిగా నిలిచిపోవడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకొంది.
ఇదీ చూడండి:- ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్‌లో తగ్గిన మరణాలు