తెలంగాణ రాష్ట్రానికి 1026 కోట్లు వస్తు సేవల పన్ను పరిహారం కేంద్రం నుంచి విడుదలైంది. జీఎస్‌టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్‌టీ చట్టంలొనే స్పష్టం చేసింది. అందులో భాగంగా 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి కేంద్రం నుంచి తక్కువ రాబడులు వచ్చిన రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు చెందిన పరిహారం రూ.1026 కోట్లు విడుదల కాగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పరిహారం దాదాపు మరో వెయ్యి కోట్లు రావాల్సి ఉందని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు.
రాబడుల కంటే తక్కువ వచ్చినట్లయితే..
రాష్ట్రానికి ప్రతి నెల రావాల్సిన జీఎస్టీ రాబడుల కంటే తక్కువ వచ్చినట్లయితే ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా పరిహారం చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. మరోవైపు బుధవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఇదే అంశంపై రాష్ట్రాలు గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల జీఎస్‌టీ పరిహారం విడుదల చేసింది.
ఇదీ చూడండి : నేతలూ... మీరూ డ్యూటీ చేయాల్సిందే!