Group-4 Applications Starts Today: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాలకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి 2023 జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు మూడు వారాల గడువు ఇచ్చింది.
పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. గ్రూప్-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, జూనియర్ అకౌంటెంట్ 429, జూనియర్ ఆడిటర్ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ కానున్నాయి.
భారీ సంఖ్యలో దరఖాస్తుల అంచనా.. గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని భావిస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.
సిద్ధంగా గ్రూప్-2, 3 ప్రకటనలు.. గ్రూప్-2, 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్-2, 3 కేటగిరీ పరిధిలోకి మరిన్ని ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను చేర్చడంతో ఆ మేరకు అదనంగా పోస్టులను గుర్తించి, వాటిని ప్రస్తుత ప్రకటనల్లో చేర్చింది. గ్రూప్-2 కింద తొలుత 663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా, అదనంగా చేరిన పోస్టులతో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 783కి చేరింది. గ్రూప్-3 కింద అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. ఈ రెండు ప్రకటనలను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. సాంకేతిక పొరపాట్లు, న్యాయ, విద్యార్హతల వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే ప్రకటనలను జారీ చేయనున్నట్లు సమాచారం.
మరో రెండు నోటిఫికేషన్ల జారీ.. రాష్ట్రంలో ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల్లో 207 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రెండు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్ ఏ, బీ) పోస్టులు, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ అధికారుల పోస్టులు భర్తీ చేయనుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈ నెల 30 నుంచి 2023 జనవరి 19 వరకు, హార్టికల్చర్ అధికారుల పోస్టులకు 2023 జనవరి 3 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది.
ఇవీ చదవండి: