Group-1 Prelims Arrangements In Telangana : రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.
CS Review On Group-1 Exam Arrangements : గ్రూప్-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దుచేసిన కమిషన్ ఆదివారం పునః పరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 2.75 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎమ్ఆర్పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని పేర్కొన్నాయి.
Group-1 Re-exam Arrangements: గ్రూప్-1 నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. గ్రూప్-1 పరీక్షలు... సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు సరైన శిక్షణను ఇవ్వాలని.. లైజన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి పరీక్షలను సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్ వద్ద అభ్యర్థులను ఫ్రిస్కింగ్ చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మహిళ అభ్యర్థులను చెక్ చేసేందుకు ఎఎన్ఎమ్, ఆశా వర్కర్లను నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ ఫోన్లు ఇతర పరికరాలను అనుమతించకూడదని ఆదేశించారు.
మరోవైపు నేడు జరిగే సుపరిపాలన దినోత్సవం ఏర్పాట్లపైనా కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వలన పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేర్చేందుకు సులభం అయ్యిందని ఆమె తెలిపారు. సుపరిపాలనపై జిల్లా, రెవెన్యూ డివిజన్ లలో, మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలిపేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చదవండి :