లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు, వలస కూలీలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపన్నహస్తం అందిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం పాట్లు పడుతూనే ఉన్నారు. అవసరమైన వారికి నిత్యావసరాలు అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన 'సోషల్ ఇనిషియేటివ్ ఫోరమ్' అనే స్వచ్ఛంద సంస్థ.. ముందుకు వచ్చింది. ఇందుకోసం ఫ్రీ రేషన్ పేరు మీద యాప్ రూపొందించారు.
పలు రకాల భాషల్లో...
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను.. అవసరమైన వారు డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో ఉండే దరఖాస్తును పూర్తి చేయాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, బంగ్లా తదితర భాషల్లో... ఫ్రీ రేషన్ యాప్ ఉంటుంది. తమకు అవసరమైన భాషను ఎంపిక చేసుకొని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం సంస్థ నిర్వాహకులు కల్పించారు.
అత్యవసరమైతేనే... రూ. 600
యాప్‌లోని దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత.. ఇనిషియేటివ్ ఫోరమ్ నిర్వాహకులు పరిశీలిస్తారు. తమ బృందం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు, సరుకులు, నిత్యావసరాలు వారికి అత్యవసరమా కాదా అనే అంశాల గురించి ఆరా తీస్తారు. వారి పరిశీలనలో అత్యవసరమని తేలితే.. దరఖాస్తుదారుడి ఇంటికి సమీపంలో ఉండే కిరాణ దుకాణం నిర్వాహకులకు... 600 రూపాయలు గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లిస్తారు. దీనితో సదరు దరఖాస్తుదారుడు కిరాణ దుకాణానికి వెళ్లి... సరుకులు పొందవచ్చు. దేశవ్యాప్తంగా తమకు ఇప్పటికే 50 వేల దరఖాస్తులు వచ్చాయని, వారిలో 4 వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు.. సంస్థ నిర్వాహకులు వివరించారు. స్వచ్ఛందంగానే కాకుండా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.
"ఎవరికైతే రేషన్ అత్యవసరముందే వారిని ఎంపిక చేసి సమీప దుకాణాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నాం. దాతల నుంచి సాయం వస్తే ఇంకా మెడికల్ మీద కూడా ఆప్ రూపొందించి సాయం అందించాలని అనుకుంటున్నాము-ఖాలిద్ సైఫుల్లా, ఫ్రీ రేషన్ యాప్ రూపకర్త"
ప్రస్తుత తరుణంలో వైద్య అవసరాలు బాగా పెరిగిపోతున్నాయని... భవిష్యత్తులో అందుకు సంబంధించిన యాప్‌ను కూడా రూపొందించే యోచనలో ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!