డెయిరీ రైతులకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయిల విడుదలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ నెల 18 తర్వాత నిధుల విడుదలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు నార్మక్స్ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డితోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, తన్నీరు హరీశ్‌రావులను ఉదయం శాసన సభలో కలిసినట్లు ఆయన తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న బకాయిల విషయాన్ని మంత్రులతో ప్రస్తావించినట్లు వెల్లడించారు.
2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నార్మక్స్ పరిధిలోని 25 వేల మంది రైతులకు రూ.24 కోట్లు, కరీంనగర్ డెయిరీ పరిధిలోని 35 వేల మంది రైతులకు రూ.28 కోట్లు, ముంగనూరు డెయిరీ పరిధిలోని రైతులకు రూ.13 కోట్ల ప్రోత్సాహక బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఈ నెల 18 తర్వాత ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయనున్నట్లు చెప్పారన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 60 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్న ఆయన.. ఈ సందర్భంగా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ