సుమారు ఆరు నెలల సుధీర్ఘ విరామం అనంతరం ప్రారంభమైన ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు గ్రేటర్ వాసులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అన్‌లాక్‌లో భాగంగా గ్రేటర్లో సిటీ బస్సులు తిరిగి ప్రారంభించిన రోజున సిటీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కేవలం 12శాతమే వచ్చింది. గ్రేటర్ పరిధిలో కేవలం 25 శాతం బస్సులే తిప్పుతున్నప్పటికీ.. ఓఆర్ మాత్రం అనుకున్నంత రావడంలేదు. అందకే గ్రేటర్ ఆర్టీసీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. సిటీ బస్సుల్లో ఎందుకు ప్రజలు ప్రయాణించడంలేదు అని.. .ఆలోచన చేశారు. లాక్డౌన్ తర్వాత ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ... గ్రేటర్ లో సిటీ బస్సులను మాత్రం నడపలేదు. దీంతో ప్రైవేట్ వాహనాలు సిటీ బస్టాపుల్లో పాగావేశాయి. ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాలు సిటీ బస్టాపుల్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు బస్టాపుల్లో ఆగకుండా చర్యలు చేపట్టారు. దీనివల్ల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లుతున్నారు.
సొంత వాహనాల్లోనే వెళ్తున్నారు
గ్రేటర్ పరిధిలో సుమారు 3వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నగర శివార్లకు సుమారు ఐదు వందల బస్సులు, గ్రేటర్ పరిధిలో 2,500ల బస్సులు తిరిగేవి. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు నిత్యం 8.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ... 32 లక్షల ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేవి. సిటీ బస్సుల్లో ఎక్కువ చిరు వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణించేవారు. దీనికితోడు విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణించేవారు. దీంతో బస్సులు కిటకిటలాడుతుండేవి. లాక్డౌన్ తర్వాత గత నెల 26న కేవలం 25శాతం బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ప్రస్తుతం విద్యాసంస్థలు నడవకపోవడంతో విద్యార్థులు బయటకు రావడంలేదు. మరోపక్క ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లేవారు సొంత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్లో ఆర్టీసీ బస్సుల ప్రారంభానికి ముందు యాజమాన్యం ప్రజలకు సరైన అవగాహన కల్పించలేదు. ఇవన్నీ కలిసి ఆక్యుపెన్సీ రేషియో తగ్గడానికి కారణాలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారిని ఆకట్టుకునేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రయాణికులకు అవగాహన
కేవలం 25 శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన డ్రైవర్లు, కండక్టర్లకు ముఖ్యమైన బస్టాపుల్లో విధులు కేటాయించారు. వాళ్లు బస్టాపుల్లో వేచివుండే ప్రయాణికులకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. బస్టాపుల్లో ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉంటే.. వెంటనే వాటిని బస్టాపుల బయటకు పంపించేలా చూడాల్సిన బాధ్యతలను వారికి అప్పగించారు. మరి కొంతమందికి బస్సులు ఏ సమయంలో బస్టాపులకు వస్తున్నాయి... సమయపట్టికను, బస్సుల నంబర్లను నమోదు చేసుకునేలా ఆదేశించారు. బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాలకు, ఆర్టీసీ సిటీ బస్సులకు గల తేడాను ప్రయాణికులకు వివరించేలా కొంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. నగరానికి కొత్తగా వచ్చే వారికి ఏ నంబర్ బస్సు ఎటు వెళుతుందో, ఏరూటు బస్సులు ఏ సమయాల్లో వస్తాయో వివరిస్తున్నారు. ఇలా..ప్రయాణికుల అభిమానాన్ని తిరిగి ఆర్టీసీ చూరగొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి సిటీ బస్సు ముందు ఈ బస్సును శాటిటైజేషన్ చేశాం.. దీన్ని పరిశుభ్రంగా ఉంచామని కాగితపు స్లిప్‌ను అంటించి ఉంచారు. తిరిగి బస్ పాస్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ బస్ పాసు కౌంటర్లు అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలను అదనపు సిబ్బంది ప్రయాణికులకు చెప్పేలా అధికారులు అవగాహన కల్పించారు.
క్రమంగా పెరుగుతోన్న ఆక్యుపెన్షీ రేషియో
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం..సురక్షితం..అత్యంత క్షేమమని సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఆర్టీసికి దూరమైన ప్రయాణికులను తిరిగి అక్కున చేర్చుకునేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు ప్రారంభమైనాడు 12 శాతం మాత్రమే వచ్చిన ఆక్యుపెన్షీ రేషియో అధికారుల చర్యలతో రెండు రోజుల్లో 20కి చేరుకుంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో ఓ.ఆర్ 30కి చేరుకుంది. ఆదాయం రూ.50 లక్షలు వచ్చింది. ప్రస్తుతం ఆక్యుపెన్షీ రేషియో 35 శాతం కాగు.. ఆదాయం రూ.60 లక్షల వరకు వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఐతే..సెలవు రోజులు, ఆదివారాలు కాస్త ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మూడో వంతు మిగిలిన పాలిటెక్నిక్ సీట్లు..