Teachers Protest: బదిలీలు, పదోన్నతుల చేపట్టాలంటూ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవని ఆవేదన చెందారు. జీవో 317ను ఏకపక్షంగా విడుదల చేసి.. 13 జిల్లాలను బ్లాక్ చేసి స్పౌజ్ కేటగిరి టీచర్లకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఉపాధ్యాయులు ఖండించారు. వివిధ పోలీసు స్టేషన్లలో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించకపోగా... పోలీసులతో అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. తమ న్యాయమైన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నారాయణ గూడ , రాంగోపాల్ పేట్, నాంపల్లి పీఎస్ల్లో ఉపాద్యాయులు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని... 467 ఎంఈఓ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను ఏ విధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. 317 జీవోను ఏకపక్షంగా విడుదల చేశారని... 13 జిల్లాలను బ్లాక్ చేసి స్పాజ్ కేటగిరి టీచర్లకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. వెంటనే ఈ జిల్లాలను ఓపెన్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు భార్యాభర్తలు కలిసి ఉండేటట్టు చూడాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కావలి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మూసీ ఉగ్రరూపం.. బ్రిడ్జీల పైనుంచి వరద.. లోతట్టు ప్రాంతాలు ఆగమాగం..