రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉన్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో జరిగిన మహమూద్ ఇబ్రహీం ఖాన్ మెమోరియల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ఫర్మెన్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలోనే అత్యున్నత క్రీడా పాలసీని రూపొందించటానికి సీఎం కేసీఆర్ ఓ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. క్రీడాకారులకు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లను తెరాస ప్రభుత్వం కల్పించిందని వివరించారు.
హైదరాబాద్‌ను బ్యాడ్మింటన్, హ్యాండ్ బాల్ క్రీడాకారుల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. అత్యాధునిక క్రీడా మైదానం కోసం.. స్థలం కేటాయింపుపై త్వరలో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎండీ మాక్సూద్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: త్వరలోనే రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ: ఈటల