Telangana Budget Sessions 2023 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెడ్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సర్కారు ఇప్పటికే లేఖ రాసింది.
Telangana Governor Vs CM : ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈమారు కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదు. నిరుడు కూడా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
Telangana State Budget Sessions 2023 : అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సిఫారసు చేసినట్లు అప్పట్లో పేర్కొన్నారు. సిఫారసు చేసేందుకు కొంత సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి సహకార, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు గత ఏడాది గవర్నర్ ప్రకటించారు.
ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిఫారసు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత బడ్జెట్ సిఫారసుకు అనుమతి కోరుతూ గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు.
రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ విధిగా సిఫారసు చేయాల్సిందేనని ప్రభుత్వం అంటోంది. సమావేశాల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఏం చేయాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బడ్జెట్‌కు గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం విచారణను 2.30గంటలకు వాయిదా వేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ ఉన్నందున అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బడ్జెట్‌కు అనుమతి కోసం ఈనెల 21న గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం ఉందో లేదో తెలపాలని రాజ్‌భవన్ అడిగిందని కోర్టుకు వివరించారు. ఆర్థిక బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గవర్నర్ విచక్షణాధికారం రాజ్యాంగబద్ధమే కానీ వ్యక్తిగతం కాదని వివరించింది.
వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు..? రాజ్యాంగ వ్యవస్థలను కోర్టు ముందుకు తీసుకురావడం ఎందుకు..? వివాదంలో మేము ఏమని ఆదేశాలు ఇవ్వాలి అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చనని తెలిపారు. ఈ క్రమంలో పలు సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తావించారు. వివాదం సున్నితత్వం, సంక్లిష్టత అర్థం చేసుకోగలనన్న దుష్యంత్ దవే.. అనుమతివ్వాలని గవర్నర్ కోరుతూ ఉత్తర్వులు ఇవ్వొచ్చని కోర్టుకు విన్నవించారు.
ఇవీ చదవండి: