రాజ్‌భవన్ పాఠశాల(Rajbhavan School)ను గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలను అధికారులు చాలా శుభ్రంగా ఉంచారని గవర్నర్ అభినందించారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా పాఠశాలకు వచ్చారని తెలిపారు. సుధీర్ఘకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు.
పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మాస్క్ ధరించడపై విద్యార్థులకు అవగాహన ఉందన్న గవర్నర్.. పిల్లల వ్యాక్సిన్ వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం ముఖ్యం. కానీ కొంతమంది మాస్క్‌ను సరిగ్గా వేసుకోవడం లేదు. వీళ్లతో పోలిస్తే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వారికి ప్రస్తుత పరిస్థితులపై అవగాహన ఉంది. వాళ్లు చాలా తెలివిగలవారు. తిరిగి పాఠశాలకు రావడం పిల్లలకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏ విద్యార్థికైనా ఇబ్బంది ఏర్పడితే పర్సనల్ కేర్ తీసుకోవాలి. తల్లిదండ్రులు ధైర్యం చేసి పిల్లలను పాఠశాలలకు పంపడాన్ని నేను అభినందిస్తున్నాను. పిల్లల బాగోగులు చూసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నాను.
-- గవర్నర్ తమిళిసై
రాష్ట్రవ్యాప్తంగా...
కరోనా నేపథ్యంలో మూసుకున్న పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలను శుభ్రం చేసి... భౌతిక తరగతులకు సిద్ధం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించి పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు.
జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గురుకులాలు మినహా మిగతా పాఠశాలల్లో నేటి నుంచి ప్రత్యక్ష బోధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాల యాజమాన్యం బలవంతపెట్టొద్దని సూచించింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. విద్యార్థులు అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించాలని పాఠశాలలకు సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్... కొవిడ్ రూల్స్ మస్ట్!