Governor Tamilsai On Kcr: ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో వస్తున్న మార్పుల వలన సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందునే ప్రధానమంత్రి మోదీని ఆయన టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా..కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. అయితే ఆయన మనసులో ఏముందో చెప్పలేమన్నారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఇష్టాగోష్ఠిలో పలు అంశాలు ప్రస్తావించారు.
‘‘తెలంగాణలో వరదలపై రాజకీయం మంచిది కాదు. క్లౌడ్ బరస్ట్ తప్పుడు యోచన. నాకున్న సమాచారం ప్రకారం సాంకేతికంగా అది సాధ్యం కాదు. భారీ వర్షాలు, వరదలు తెలంగాణలోనే కాకుండా యానాంలోనూ వచ్చాయి. సహజంగానే వర్షాలు పడ్డాయి. ప్రగతిభవన్.. రాజ్‌భవన్ మధ్య గ్యాప్ ఇప్పుడు బహిరంగ రహస్యం. యథాతథస్థితి (స్టేటస్ కో) ఉంది. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కలిసిన తర్వాత కూడా నాకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదు. వరదల సమయంలోనూ అధికారులు ఎవరూ రాలేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్పందించడం నా బాధ్యత. భద్రాచలం ప్రాంతంలో నేను దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల్లోని గిరిజన ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని తెలిసి వెళ్లా. నేను వెళ్లడంతో వారికి నైతిక స్థైర్యం రావడంతో పాటు సహాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తారని భావించా. నా పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. గతంలో తుపాను వచ్చినప్పుడు భద్రాద్రిలో, యానాంలో పర్యటించా. కరోనా సమయంలో వివిధ ఆసుపత్రులను సందర్శించా. వరద ప్రాంతాల్లో నేను పర్యటిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? హెలికాప్టర్, ఇతర సదుపాయాలు అడిగి లేదనిపించుకోవడం కన్నా ప్రజలతో మమేకం కావడమే నాకు ముఖ్యం. కేంద్ర ఆదేశాల మేరకే నేను వరద ప్రాంతాల్లో పర్యటించాననేది పూర్తిగా అవాస్తవం.
2 పడకగదుల ఇళ్ల విషయంలో వ్యతిరేకత
రెండు పడక గదుల ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వరద ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు వచ్చింది ఎమ్మెల్యేనో, ఎంపీనో అనుకొని చాలా మంది ఆ ఇళ్ల కోసం ఆందోళన చేశారు. నేను గవర్నర్ అని తెలిసిన తర్వాత శాంతించారు. వరద ప్రాంతాల్లో సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశా. తెలంగాణకు కేంద్రం తగిన మద్దతు ఇస్తోంది. వరదల సందర్భంలో రాష్ట్రానికి నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవలే లెక్కలు విడుదల చేశారు. రాష్ట్రానికి కేంద్రమంత్రి గడ్కరీ పెద్ద సంఖ్యలో జాతీయ రహదారులు మంజూరుచేశారు. తెలంగాణ ప్రైడ్, ఇతర కార్యక్రమాలను కేంద్రం చేపడుతోంది.
కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్, పేదలకు ఉచితంగా 5 కేజీల అదనపు బియ్యం అందించింది. ఆ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని నా దృష్టికి వచ్చింది. కేంద్ర పథకాలకు జవాబుదారీతనం ఉండాలి. విభజన హామీలు ఇప్పటికే చాలావరకు నెరవేరాయి. భాజపా-తెరాస మధ్య ఒప్పందం ఉందంటూ ఎవరైనా ఊహాగానాలు చేసుకోవచ్చు. గవర్నర్‌గా నాకు స్పష్టత ఉంది. రాష్ట్రంలో ముక్కోణపు పోటీనా, ముఖాముఖి పోటీనా అనే దానిపై నేను సంచలనాత్మకంగా మారాలనుకోవడం లేదు. అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళ రాష్ట్రపతి పదవిని అలంకరించడం భారతదేశంలోనే సాధ్యం. ఒక మహిళా రాష్ట్రపతి వద్ద.. మహిళా గవర్నర్‌గా పనిచేయడం మంచి అవకాశం. గొప్ప గౌరవం’’అని గవర్నర్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని విలేకరులు ప్రశ్నించగా దానిపై తాను వ్యాఖ్యానించనన్నారు. తనను ఆహ్వానించినందున హాజరయ్యానని తమిళిసై స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఇటీవల ఉపరాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరుకాలేకపోయానని ఆయనకు తెలిపారు.
ఇవీ చదవండి: హస్తినలో సీఎం కేసీఆర్.. కొత్త రాష్ట్రపతిని కలిసే అవకాశం!