మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దార్శనిక నాయకత్వం ఐసీయూలో ఉన్న భారతదేశ ఆర్థికవ్యవస్థకు మళ్లీ జీవం పోసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. పీవీ కుమార్తె వాణీదేవి మాదాపూర్లో ఏర్పాటు చేసిన స్మారక మ్యూజియాన్ని గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా ప్రారభించారు. రాజ్ భవన్లో పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తమిళిసై... నరసింహారావు చిత్రపటాలు, పుస్తకాలు, వస్తువులు, జ్ఞాపికలతో మ్యూజియం ఏర్పాటు చేసిన వాణీదేవిని అభినందించారు.
పీవీ కేవలం ఆర్థిక సంస్కర్త మాత్రమే కాదు, రాజకీయ సంస్కర్త కూడా అని తమిళిసై ప్రశంసించారు. తెలంగాణ గడ్డ గర్వించదగ్గ గొప్ప బిడ్డ పీవీ అని, దేశం ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా ఉండడం తనకు ఎంతో గౌరవంగా ఉందని వ్యాఖ్యానించారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నరసింహారావు పోరాడారన్నారు.
ప్రధానమంత్రి సహా ఎన్నో పదవులను అధిరోహించిన పీవీ... గురుకుల, నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రిగా ఉండి వందలాది ఎకరాల సొంత భూములను ఇచ్చి సంస్కరణలకు నాంది పలికారని గవర్నర్ తెలిపారు. దిల్లీలో పీవీ స్మారకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ మాజీ ప్రధానిని గొప్పగా గౌరవించారని తమిళిసై తెలిపారు.