Governor on PG Medical Student Health Condition: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు గవర్నర్ తమిళిసై ఆసుపత్రికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. ప్రస్తుతం వైద్య విద్యార్థికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారని తమిళిసై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
పీజీ వైద్యవిద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఉన్నతవిద్యలో రాణిస్తున్న బంగారుతల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నర్ వ్యాఖ్యానించారు. త్వరగా కోలుకుని మళ్లీ యథాస్థితికి రావాలని తమిళిసై ఆకాంక్షించారు. వైద్యులు అన్ని రకాల ట్రీట్మెంట్లు అందిస్తున్నారని తెలిపారు. సీనియర్ వైద్యుడు విద్యార్థిని వేధించడం దారుణమన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని గవర్నర్ వెల్లడించారు.
'ఒక వైద్య విద్యార్థినికి ఇలా జరగటం దురదృష్టకరం. వైద్య విద్యార్థినులు ధైర్యంగా ఉండాలి. ఒక డాక్టర్‌గా ఆమె కండిషన్ నాకు అర్థమవుతుంది. తన కండిషన్ క్రిటికల్‌గా ఉంది. డాక్టర్స్‌కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని చెప్పాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. తను చాలా క్లవర్ స్టూడెంట్ అని తెలిసింది. యూపీఎస్సీ కూడా క్లియర్ చేసిందని పేరెంట్స్ తెలుపుతున్నారు. సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తాం.'-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నిమ్స్ వద్ద ఉద్రిక్తత : నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల నేతలు ఒక్కసారిగా ఆసుపత్రి వద్దకు చేరుకోవడం... తమను బాధితురాలిని పరామర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందు జాగ్రత్తగా నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేతలను ఆసుపత్రిలోనికి అనుమతించకపోవడంతో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో పోలీసులు దర్యాప్తును సక్రమంగా చేయడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు : వైద్య విద్యార్థిని తండ్రి కూడా ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. కళాశాలలో కొందరు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన వారిని తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె తండ్రి డిమాండ్ చేశారు.
ఇక వ్యవహారంపై మంత్రి హరీశ్‌రావు కూడా స్పందించారు. వైద్య విద్యార్థిని సంఘటన బాధాకరమన్న హరీశ్‌రావు.. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందని హామీనిచ్చారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నరారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించారు. ఆమె తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్‌రావు.. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు.
ఈ కేసులో నిందితునిపై ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వరంగల్ ఏసీపీ తెలిపారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం శాఖపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం అవాస్తవమన్నారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు.
ఇవీ చదవండి: