Governor Tamilisai Soundararajan: స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు భారతదేశం గర్వించేలా చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ తయారీదారులు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రారంభించడం ద్వారా మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడంలో దేశానికి సహాయం చేశారని కొనియాడారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెల్త్ బీట్ కవర్ చేసే జాతీయ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు.
ఇది విశ్రాంతి తీసుకోవడానికి సమయం కాదన్నారు. వ్యాక్సినేషన్ మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిందని.. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో అద్భుతమైన విజయం సాధించినందుకు మన దేశం ఒక క్లాసిక్ గ్లోబల్ కేస్ స్టడీగా ఉద్భవించిందన్నారు.జాతీయ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు గవర్నర్ స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో తృతీయ స్థాయిలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం తన హృదయానికి దగ్గరైన అంశమని అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధత గురించి గవర్నర్ ప్రస్తావిస్తూ, మహమ్మారిపై మెరుగ్గా పోరాడడంలో దేశానికి సహాయం చేయడానికి వైద్యులు, శాస్త్రీయ సోదరభావం ద్వారా గొప్ప పరిశోధనల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపడాలని తమిళిసై ఆకాంక్షించారు. వైద్యరంగంలో పరిశోధనలు మరింత పెరగాలన్నారు.
గిరిజన స్త్రీలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి రక్తహీనత నివారణపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. మహమ్మారికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో... నివారణ చర్యలపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్రను కూడా గవర్నర్ కొనియాడారు. దిల్లీ నుండి వచ్చిన ప్రతినిధి బృందం భారత్ బయోటెక్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లను సందర్శించింది.
ఇదీ చదవండి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటన రద్దు