Tamilisai Did Not Approve Pending Bills: బడ్జెట్ సమావేశాల ప్రతిష్టంభన వీడిన సమయంలో.. పెండింగ్ బిల్లులకు కూడా మోక్షం కలుగుతుందని అందరూ భావించారు. సమావేశాల ప్రసంగం సందర్భంగా గవర్నర్ ప్రసంగం, సంబంధిత ప్రక్రియలన్నీ సాఫీగా సాగడంతో బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు వాటికి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర పడలేదు. సెప్టెంబర్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎనిమిది బిల్లుల్లో.. ఏడు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
Pending Bills at Governor Tamilisai : రాష్ట్రంలోని మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ బిల్లు తెచ్చింది. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీకళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పనకై బిల్లును తెచ్చింది.
వీటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను కూడా సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, పురపాలకచట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లును తీసుకొచ్చింది. అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపు దాల్చింది. మిగిలిన ఏడు బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
మిగతా ఆరు బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం లభించలేదు: మిగతా ఆరు బిల్లులకు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ వద్దే పెండింగ్‌లోనే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై విద్యాశాఖ మంత్రి, అధికారులను పిలిపించి మరీ వివరణ తీసుకున్నారు. ఆ బిల్లు సహా ఏవీ కూడా ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. బడ్జెట్ సమావేశాల అంశానికి సంబంధించిన ప్రతిష్టంభన వీడిన సమయంలో పెండింగ్ బిల్లుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరినట్లు తెలిసింది. వివరణలు తీసుకొని బిల్లులు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజ్‌భవన్ తరఫు న్యాయవాది అన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల కోసం గవర్నర్‌ను ఆహ్వానించిన సమయంలోనూ బిల్లుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బిల్లులను ఆమోదించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
బిల్లులపై తనకున్న సందేహాలపై ఆయా శాఖల నుంచి వివరణ తీసుకున్న అనంతరం బిల్లులను ఆమోదిస్తారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వాటికి ఇంకా ఆమోద ముద్ర పడలేదు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులతో పాటు.. మరో మూడు బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.
పదికి చేరిన మొత్తం బిల్లుల సంఖ్య : పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, చట్ట సవరణల బిల్లులు అందులో ఉన్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు నిన్న గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మిగతా బిల్లులను మాత్రం ఇంకా ఆమోదించలేదు. దీంతో గవర్నర్ ఆమోదించాల్సిన మొత్తం బిల్లుల సంఖ్య పదికి చేరుకొంది.
ఇవీ చదవండి: ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే
నీటి కోసం 74 ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. మూడు బావులను తవ్విన 'వెల్మ్యాన్'