Governor Tamilisai at Ambedkar University : సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదే సమయంలో అందరూ కరోనా వాక్సిన్ వేయించుకోవాలని, యోగా చేయాలని.. మంచి ఆహారం తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.
'జీవితం అనేది అంత సులభమైంది కాదు. యువత సవాళ్లను ఎదుర్కోవడం లేదు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలి. మంచి ఆరోగ్య జీవన శైలి పెంపొందించుకోవాలి. కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి.'- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదిలా ఉండగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారు. వర్సిటీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొననున్నారు.