Governor Tamilisai on TSRTC Bill : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపై చర్చించేందురు గవర్నర్ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. ఇదే అంశంపై చర్చించేందుకు గవర్నర్ రవాణా శాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. బిల్లు వెనక్కి పంపడానికి కారణాలు, బిల్లుపై ఉన్న సందేహాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో చర్చిస్తున్నారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి, అధికారులకు మధ్యాహ్నం వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ అధికారులతో ఏం చర్చించనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
TSRTC Bill Latest Update : మరోవైపు నాలుగో రోజూ తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటితో సమావేశాలు ముగియనుండడంతో ఈరోజు సభలో వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఆర్టీసీ బిల్లు అంశంపై సభాపతి, మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు. గవర్నర్ అనుమతి ఇస్తే వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
Excitement over TSRTC Bill : ఆమోదిస్తారా..? ఆపుతారా..? ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ
MLC Jeevanreddy on TSRTC Bill : నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియా పాయింట్‌లో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కోరిన వివరణ సీఏస్ ద్వారా ఇవ్వాలన్నారు. ఆర్టీసీ విలీనాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదేనన్న ఆయన.. పింఛన్, పే స్కేల్ ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను పొడగించైనా ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని జీవన్‌రెడ్డి అన్నారు.
గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ : బిల్లుపై రాజ్‌భవన్ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం.. మళ్లీ రాజ్‌భవన్ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తంచేయడం, ప్రభుత్వమూ సాయంత్రమే వాటికి సమాధానాలు పంపడంతో అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండగా ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, పింఛన్లు, ఉద్యోగ భద్రత వంటి 5 ప్రధాన అంశాలపై సందేహాలు లేవనెత్తగా... సీఎస్ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్ మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన లేఖను విడుదల చేసిన రాజ్‌భవన్... ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్‌భవన్ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్ తదుపరి వివరణను కోరారని పేర్కొంది.