ఆధునిక సమాజంలో తలెత్తుతున్న మానసిక సమస్యలపై తెలంగాణ సైకియాట్రీ సొసైటీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాజ్‌భవన్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. దశాబ్దాలుగా చాలా మందిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీతో కలిసి టీఎస్‌పీసైకాన్(TSPSYCON) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సు రెండురోజుల పాటు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మానసిక నిపుణులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఈ సదస్సులో పాల్గొననున్నారు. టెక్నాలజీతో ఏర్పడుతున్న మానసిక సమస్యలు, ఆధునిక వైద్య విధానాల గురించి సమావేశంలో విశ్లేషణలు జరగనున్నాయి.
13 శాతం మందికిపైగా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ సమస్యలను బయటికి చెప్పుకోవడానికి భయపడతారని పేర్కొన్నారు. చిన్నపిల్లలు ఫోన్, గేమింగ్ బారినపడి అతి చిన్న వయసులో మానసిక ఒత్తిడి, ఆత్మన్యూనతాభావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక సమస్యలను అధిగమించేందుకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రసంశించారు. ఈ సదస్సు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశించారు. ఆధునిక టెక్నాలజీతో పురుషులు, మహిళలు, పిల్లల్లో.. మానసిక రోగాలు, సమస్యలను అధిగమించేందుకు వైద్య రంగం మరింత కృషిచేయాలని గవర్నర్, నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: BANDI SANJAY: ఈటలకు బండి సంజయ్ పరామర్శ